Krishna River | మాగనూరు/మక్తల్, ఫిబ్రవరి 22 : జీవనది కృష్ణమ్మ కళతప్పింది. జలకళను కోల్పో యి బోసిపోయింది. రాళ్లు, రప్పలు తేలి కనువిందు కరువైంది. నదిలో నీరు గణనీయంగా తగ్గడంతో ఎడారిని తలపిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ నదీతీర ప్రాం తాల్లో నీరు పూర్తిగా తగ్గింది. యాసంగిలో సాగైన చివరి పంటలకు సాగునీరు అందుతుందా? అన్న ఆందోళన రైతుల్లో నెలకొన్న ది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని అయిన కృష్ణమ్మ అడుగంటడంతో ఎత్తిపోతలకు నీళ్లందని పరిస్థితి. మాగనూరు మం డలం ముడుమాల్-ఏ, ముడుమాల్-బీ, మురారిదొడ్డి, కృష్ణ, తంగిడి లిఫ్ట్ నీటి ఆధారంగా వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఎండాకాలం రాకముందే నదిలో నీళ్లు ఇంకిపోవడంతో సాగునీరు కష్టాలు తప్పవేమోన న్న ఆందోళనతో.. కొందరు రైతులు పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నది మధ్యలో నుంచి పెద్ద పెద్ద మోటర్లు ఏర్పాటు చేసి ఉన్న నీటిని తోడేసుకుంటున్నారు.
కాగా 24 గంటలపాటు మోటర్లు పనిచేసినా నీళ్లు పొలాలకు అందడం లేదని వాపోతున్నారు. నదిలో నీరు సమృద్ధిగా ఉంటేనే ఎత్తిపోతలకు నీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే మక్తల్ మండలం పసుపుల, పంచదేవ్పాడు, పారేవుల ప్రాంతాల్లోని రైతులు యాసంగిలో 6 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 15 రోజుల కిందట మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు కృష్ణానదికి నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి కోరినా.. నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా నీళ్లు వదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.