జనగామ రూరల్, ఫిబ్రవరి 27: ‘మా పంటలు ఎండిపోతున్నాయి.. తలాపునే రిజర్వాయర్ ఉండి ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని విడుదల చేయకపోవడం ఏంటని..’ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గురువారం జనగామ జిల్లా జనగామ మండలంలోని గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, పెద్దపహాడ్, గోపరాజుపల్లి, వడ్లకొండ, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి రైతులు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తమ గోడును వెల్లడించారు. అనంతరం గోదావరి జలాలు విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు విడుదల చేసి పంటలను కాపాడాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేసి బొమ్మకూర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలనే ఆలోచన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా గోదావరి జలాలను కాల్వలకు విడుదల చేసి పంటపొలాలను కాపాడాలని ఇరిగేషన్ అధికారి మంగీలాల్‌తో ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లో నీటిని విడుదల చేయడానికి కృషి చేస్తానని ఇరిగేషన్ అధికారి తెలిపారు.