హైదరాబాద్ ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రతి పల్లెలో పచ్చదనం పెంచాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ నేతలు పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే నరికివేయడం దారుణమని బుధవారం ఎక్స్ వేదికగా ఖండించారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేండ్లుగా తెలంగాణ విలవిలలాడుతున్నదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు మనుషులనే కాదు, చివరికి చెట్లను కూడా బతకనివ్వడంలేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు ఆహ్లాదకర వాతావరణంలో కళకళలాడిన పల్లెలను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. అధికారపార్టీ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతున్నదని తెలిపారు. ‘ఇప్పటికే చెక్ డ్యామ్‌లను పేల్చివేశారు. చెరువులను చెరబట్టారు. వ్యవసాయాన్ని కుప్పకూల్చారు. కుల వృత్తులను కాలరాశారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను సైతం ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నరు’ అంటూ విమర్శలు గుప్పించారు. జీనుగురాల ప్రకృతి వనంలో చెట్లను నరికివేయించిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధ్వంసపూరిత విధానాలతో ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని పాడుకొనే దుస్థితి నెలకొన్నదని వాపోయారు. పల్లెజనంపై పగబట్టిన కాంగ్రెస్‌పై తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు.