హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల వ్యవహారం రాజకీయంగా మళ్లీ వేడెకింది. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం నియమించిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో రెన్యువల్ కోసం పాత చైర్మన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, 2024 జూలై 7న 37 రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించింది. వారి రెండేండ్ల పదవీకాలం జూలై 8, 2026తో పూర్తయ్యింది. పదవులు ముగిసిన వారిలో తూర్పు జగ్గారెడ్డి భార్య నిర్మల, పటేల్ రమేశ్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ఎం వీరయ్య తదితరులు తమకు మరో అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారు ఢిల్లీస్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. కొందరు నేతలు నాయకులు గాంధీభవన్ చుట్టూ లాబీయింగ్ మొదలుపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ నియామకాలను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ముఖ్యనేత ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పోస్టులను రెన్యూవల్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా లేరని పార్టీ వర్గాలంటున్నాయి. పాత చైర్మన్ల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సీఎం, రెన్యువల్‌కు అర్హులైన వారి సంఖ్యను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయనున్నట్టు తెలిసింది. మిగతావి రెన్యువల్ అవసరం లేదనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఖాళీ అయిన వాటితోపాటు ఇప్పటివరకు భర్తీ చేయనివి కలిపి 50కి పైగా పదవులు ఖాళీగా ఉన్నాయి. తన పదవి పొడిగింపు వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నదని చెప్పేందుకే జగ్గారెడ్డి తాను ఎన్నికల్లో పోటీ చేయను అని, తన భార్య పోటీ చేస్తుందనే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి ప్రకటనల ద్వారా పార్టీ అగ్రనాయకత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
ముఖ్యనేత ఆలోచన మరోతీరుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాబోయే ఎన్నికల ముందు జరుగుతున్న కీలక భర్తీలు కాబట్టి తన రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా భర్తీ చేసుకోవాలనే భావిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. తనకు అండగా ఉండే వారికే పదవులు కట్టబెట్టాలని చూస్తున్నట్టు తెలిసింది. అసలు కాంగ్రెస్ నేతలకు బదులు వలస కాంగ్రెస్ నేతలతో కీలకమైన పదవులు భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా సీనియర్లను మొత్తానికే పక్కనపెట్టి, తన వెంట వచ్చేవారి పేర్లతో లిస్ట్ సిద్ధంచేయాలని తన శిబిరం నేతలను ఆదేశించినట్టు సమాచారం.
దీనికి భిన్నంగా, కుల సంక్షేమ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల మే 6న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 18 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11మంది వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్(బస్వరాజు శ్రీనివాస్), కమ్మ కార్పొరేషన్(బండి రమేశ్), వెలమ కార్పొరేషన్(జువ్వాడి నర్సింగ్ రావు), యాదవ సహకార సంస్థ(ఎం రఘునాథ్ యాదవ్), మున్నూరుకాపు(బొమ్మ శ్రీరామ్), వాల్మీకి బోయ(గట్టు తిమ్మప్ప), పద్మశాలి(గూడూరు శ్రీనివాస్) కార్పొరేషన్లకు నియా మకాలు జరిగాయి. మిగతావి జూలైలో భర్తీ చేస్తామని అప్పట్లోనే టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. కొత్త చైర్మన్లను నియమించినా, కార్పొరేషన్లకు నిధుల విడుదల లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చైర్మన్ల భర్తీ కంటే నిధుల కొరతే పెద్ద సమస్యగా మారిందని, సబ్సిడీ రుణాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం సరిపడా నిధుల్లేక చాలా కార్పొరేషన్లు నామమాత్రంగానే కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. మరోవైపు కొత్త చైర్మన్లలో కొందరు కార్యాలయాలు, భద్రతా సిబ్బంది వంటి సౌకర్యాల కోసం ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.