మద్దూర్, జూలై 14 : కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఎంఈవో జనార్దన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్ మండలం వల్లంపల్లికి చెందిన విద్యార్థిని మద్దూరు మండలం పెదిరిపాడ్ కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. సోమవారం సాయంత్రం బంధువునంటూ ఓ యువకుడు విద్యార్థినితో మాట్లాడేందుకు కళాశాలకు రాగా.. అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలు అతడిని మందలించి పంపించింది.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ కళాశాల గేటు వద్దకు వచ్చిన యువకుడు విద్యార్థినితో మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది విద్యార్థిని కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. తల్లిదండ్రులు మంగళవారం కళాశాలకు వచ్చి తనను మందలిస్తారన్న భయంతో కళాశాల భవనం రెండో అంతస్తుపై నుంచి కిందికిదూకింది. బాలికను వెంటనే మద్దూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ దవాఖానకు తీసుకెళ్లగా, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.