KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 4 (నమస్తే తెలంగాణ)/ కోనరావుపేట : రైతులకు 48గంటల్లో సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడకుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ కార్యాలయ చాంబర్ ఎదుట ధర్నా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని కాళేశ్వరం 9వ ప్యాకేజీ ఈఈలు కిశోర్, అమరేందర్‌రెడ్డి మధ్యమానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపులను ప్రారంభించారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలో సాగునీరందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు కేటీఆర్‌కు ఫోన్ చేసి మొరపెట్టుకున్నారు. దీంతో కేటీఆర్ ఆదివారం జిల్లాకు వచ్చి పార్టీ నేతలతో కలిసి తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించారు. అక్కడి రైతులు కేటీఆర్‌కు ఎండిన పొలాలను చూపిస్తూ ఆరుగాలం చేసిన కష్టార్జితం పశువుల పాలైందంటూ గోడు వెళ్లబోసుకున్నారు. చలించిన కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ అండగా ఉంటారని ధైర్యం ఇచ్చారు. అనంతంరం విలేకరులతో మాట్లాడారు. మధ్యమానేరులో నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 48 గంటల్లో నీటిని విడుదల చేయకుంటే నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాంబర్ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ఇప్పటికే 450 మంది రైతులను పొట్టపెట్టుకున్న ప్రభుత్వం ఇంకెంత మందిని బలితీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనంవల్లే సిరిసిల్ల, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మధ్యమానేరు ద్వారా మల్కపేట రిజర్వాయర్ నింపిన విషయాన్ని గుర్తుచేశారు. మధ్యమానేరులో నిలువ ఉన్న 16 టీఎంసీలలో ఒక టీఎంసీని కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌కు విడుదల చేస్తే సిరిసిల్ల రైతుల సాగుకు సరిపోతుందని, తాగునీటికి మరో 3టీఎంసీలు పోను, ప్రాజెక్టులో 13టీఎంసీల నీరు ఉంటుందని చెప్పారు. కేటీఆర్ అల్టిమేటంతో దిగివచ్చిన సర్కారు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ను ఆదేశించింది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ ఈఈ కిశోర్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డితో కలిసి మల్కపేట రిజర్వాయర్‌ను పరిశీలించి, పం పుహౌస్లను తనిఖీ చేశారు. సిరిసిల్ల రామప్పగుట్ట శివారులోని మధ్యమానేరు పంప్‌హౌస్‌లో ఒకటో మోటర్ ఆన్‌చేసి మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు మొదలు పెట్టారు. 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్కపేట రిజర్వాయర్‌లోకి 0.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కేటీఆర్ కృషితో వందలాది ఎకరాలకు సాగునీరందనుండగా, సిరిసిల్ల జిల్లా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని పంటచేలకు రంగనాయక్‌సాగర్ నీటిని విడుదల చేయాలని కేటీఆర్ చేసిన సూచనలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కేటీఆర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు ఫోన్‌చేసి రంగనాయకసాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు తెల్లవారే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యమానేరు నుంచి మల్కపేటకు ఒకటో పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నాం. తెల్లవారేసరికి రెండో పంపు ప్రారంభిస్తాం. మల్కపేట రిజర్వాయర్‌లో నీటిని నింపి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.