హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయాయని శనివారం ఎక్స్‌వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భజలాల సంరక్షణలో తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదర్శంగా నిలిపిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో నీటి ప్రణాళికలు పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భూగర్భజలాలు 56 శాతం పెరిగాయని వివరించారు.
మిషన్ కాకతీయ ద్వారా 27,000కు పైగా చెరువులను పునరుద్ధరించడంతో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అంది, 8.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని తెలిపారు. రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి, భూగర్భజలాల నిల్వ స్థిరంగా ఉండి, తాగునీటి భద్రత కూడా బలపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో భూగర్బ జలాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రెండు మీటర్లకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయని, యాదాద్రి, భువనగిరిలో 2.71 మీటర్ల భారీ తగ్గుదల నమోదు కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఇతర జిల్లాల్లోనూ భూగర్భజలాల స్థాయి తీవ్రంగా పడిపోయిందని ఉదహరించారు. ‘120 కిలోమీటర్ల పొడవునా గోదావరి పూర్తిగా ఎండిపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మేడిగడ్డ బరాజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించిన మిషన్ భగీరథ పథకం ఇప్పుడు పూర్తిగా కుంటుపడిందని, ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు.తాగునీటి కోసం ఎకువ మోటర్లు నడిపించుకోవాల్సి రావడం వల్ల కరెంట్ బిల్లులు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బలమైన నీటిపారుదల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పతనం చేస్తున్నదని విమర్శించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత తీవ్రమైన నీటి కొరతను ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.