హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కరీంనగర్ వేదికగా ఉద్యమిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇస్తానన్న రూ.2,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4వేల పింఛన్, రిటైర్డ్ బెనిఫిట్స్, డీఏలు, ఈపీఎఫ్ డబ్బులు రాక రిటైర్డు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్ రైతులకు సరిపడా యూరియా కూడా ఇచ్చే పరిస్థితిలో లేదని ఎద్దేవాచేశారు.
ఆయా వర్గాలను ఏకం చేసి కరీంనగర్ వేదికగా ప్రభుత్వానికి సెగ పుట్టిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూస్తారని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు సరికాదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలపై స్పందిస్తూ.. ఎన్నికల్లో ప్రతిసారీ అనుకూల ఫలితాలు రావని పేర్కొన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం పక్కాప్లాన్‌తో దక్కించుకోబోతున్నామని స్పష్టంచేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం రూ.1400 కోట్లు పనులు చేశామని బండిసంజయ్ తెలిపారు.