మేడ్చల్, ఫిబ్రవరి 14 : ‘మా చీరలు మాకివ్వండి, మేం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి’ అంటూ ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు జులం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాలలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఓడింది.
స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావడం నిరాశకు గురి చేసింది. దీంతో ఓటర్లకు ఇచ్చిన తాయిలాలను తిరిగి తీసుకోవాలని అభ్యర్థిని కుటుంబసభ్యులు శనివారం బయల్దేరారు. తమకు ఓట్లు వేయలేదంటూ తాము ఇచ్చిన కానుకలు, డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ చీరలు, డబ్బులు వసూలు చేశారు. స్థానికులు అభ్యర్థిని కుటుంబం తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరలైంది.
మూడుచింతలపల్లి మున్సిపాలిటీని జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ గ్రామంలో కాంగ్రెస్కు నాలుగో స్థానం వచ్చింది. ఆ గ్రామం నుంచి ఐదుగురు కౌన్సిలర్ అభ్యర్థికి పోటీ పడ్డారు. అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇద్దరు స్వతంత్రులు పోటీ పడ్డారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి 258 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి 211 ఓట్లతో రెండో స్థానం, బీజేపీ 168 ఓట్లతో మూడు స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి 97 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.