సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 14 : ‘ఒట్టేసి చెప్పు.. మాకు ఓటేశావా.. లేదా.. ఒకవేళ ఓటు వేయకుంటే మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి.’ అంటూ పోటీ చేసిన ఓ బీజేపీ అభ్యర్థి ఓటర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చర్చనీయాంశమవుతున్నది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయింది. ఈ డివిజన్ పరిధిలో సీతారాంపల్లి, ప్రశాంత్‌నగర్, వెంకటేశ్వర, వినాయక, సాయి టౌన్షిప్ ఉన్నాయి. ప్రచార సమయంలో ఒక్కో ఓటుకు రూ. 3 వేల చొప్పున పంపిణీ చేయగా, ఆ డబ్బులు తిరిగి వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీతారాంపల్లిలో ఓటర్లకు పంచిన లిస్టుతో ఇంటింటికీ తిరుగుతూ మాకు ఓటు వేశావా.. లేదా..! అంటూ చేతిలో చెయ్యేసి ఒట్టు వేయించుకోవడం కనిపించింది. ఓటు వేస్తే ఓకే.. లేదంటే డబ్బులు తిరిగివ్వండి అంటూ గ్రామంలో తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఓటు వేయని వారు డబ్బులు తిరిగి ఇచ్చినట్టు ఆమె చేతిలో కనిపించిన నగదును బట్టి అర్థమవుతున్నది. తాము ఓట్ల కోసం ఎవరినీ డబ్బులు అడుగలేదని.. ఓటు వేయాలని మీరు మాకు ఎందుకు డబ్బులిచ్చారని ఈ సందర్భంగా అక్కడ ఉన్న పలువురు ప్రశ్నించడం వీడియోలో కనిపించింది.