బంజారాహిల్స్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లో బంజారాహిల్స్ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా యజమానులు తమ భూమిలో ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు పాటిస్తారు. మరి అలాంటిది బంజారాహిల్స్ ప్రాంతంలో ఓనర్స్ ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ మహానగరం మొత్తానికి తాగునీరు సరఫరా చేసే జలమండలి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే డిపార్ట్మెంట్కు చెందిన ఎకరంన్నర భూమి కబ్జాకు గురయితే కనీసం తమ దృష్టిలో కూడా లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ కథనంతో బయటపెట్టడంతో అరేరే.. అలా జరిగిందా.. మాకు తెలియదే..! అంటూ కహానీలు చెబుతున్నారు.
నిద్రమేల్కొన్న అధికారుల ఉలిక్కిపాటు!
ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్‌నం-10లో జలమండలికి మొదటి విడతగా ఎకరం స్థలం కేటాయించింది. ఆ భూమిని జలమండలి కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నది. రెండో విడతలో ఎకరంన్నర కేటాయించింది. కానీ ఆ స్థలాన్ని గాలికి వదిలేసింది. ప్రైవేటు వ్యక్తుల స్థలాలనే కబ్జా చేసుకునే దొంగలు ఉన్న ఈ రోజుల్లో.. ప్రభుత్వ స్థలం, అందులోనూ ఆ డిపార్ట్మెంటే పట్టించుకోకుండా వదిలేసిన స్థలం కావడంతో ఇటీవల అక్రమార్కుల కన్నుపడింది. రూ.200 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని పార్థసారథి అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఆ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. లోపల గదుల నిర్మాణాలు కూడా మొదలు పెట్టాడు. తన వ్యక్తిగత సిబ్బందిని బందోబస్తుగా పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. జలమండలి అధికారులు నిద్ర నటిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, విజిలెన్స్, హైడ్రా అధికారులు హడావుడిగా స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని రక్షించడంలో నిర్లక్ష్యం వహించారంటూ జలమండలి స్థానిక అధికారులపై మండిపడ్డారు. అక్రమార్కులు స్థలాన్ని కబ్జా చేస్తుంటే కనబడటం లేదా అని ప్రశ్నించారు.
అంతా మీరే చేశారు.. మాకేం తెలియదు!
హైదరాబాద్ నగరం నడిమధ్యలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయితే అధికారులు అర్థంపర్థం లేని సాకులు చెబుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయకపోవడం వల్లే స్థలం అన్యాక్రాంతమైందని జలమండలి అధికారులు సమర్థించుకున్నారు. మార్కింగ్ చేసి ఇస్తే ప్రహరీ నిర్మించేవాళ్లమని ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు. క్షేత్రస్థాయి అధికారులు మార్కింగ్ చేసినట్టు తమకు చెప్పారని, కానీ మార్కింగ్ చేయలేదని, ఆ సంగతి కూడా తెలియదని రెవెన్యూ అధికారులు సమర్థించుకున్నారు. జలమండలి ఎండీ సమక్షంలో రెండు విభాగాల అధికారులు మీరంటే మీరే కారణమని చేతులు దులుపుకున్నారు. దీంతో షేక్‌పేట మండల సర్వేయర్లు ఫీల్డ్ మార్కింగ్ చేశారు. సదరు స్థలం ప్రభుత్వానికి చెందినదని బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో కబ్జాదారుల మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కబ్జా వెనుక ఎవరున్నారనే వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు.
అబ్బే… అసలు కబ్జానే జరగలేదు!
‘నమస్తే తెలంగాణ’ కథనంతో అధికారుల్లో కదలికవచ్చింది. అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలం సురక్షితమైంది. రోజంతా ఉన్నతాధికారుల హడావుడితో పరుగులు పెట్టిన జలమండలి, రెవెన్యూ అధికారులు సాయంత్రానికి అసలేమీ జరగనట్టు వ్యవహరించారు. జలమండలి స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. జలమండలి అధికారులు కోరడంతో స్థలానికి మార్కింగ్ చేసి ఇచ్చామని తెలిపారు. అక్రమార్కులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం, లోపల గదులు నిర్మించుకున్నారు కదా అని అడిగితే మాత్రం సమాధానం దాటవేశారు. జలమండలి ఎండీ స్వయంగా పరిశీలించి కబ్జాపై అధికారులపై మండిపడ్డారు. కానీ జలమండలి అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం కబ్జా వార్తలు అవాస్తవమని బుకాయించారు.