– కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ వినతి
గట్టుప్పల్, ఫిబ్రవరి 23 : క్రషర్ మిషన్ ఏర్పాటు అనుమతులు రద్దు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను గట్టుప్పల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఇడం కైలాసం కోరారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 216లో ఏర్పాటు చేయనున్న క్రషర్ మిషన్ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న గట్టుపల్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో దుమ్ము ధూళి కారణంగా వ్యవసాయ భూములు సేద్యానికి పనికిరాకుండా పోయి ప్రజలు అనారోగ్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరభద్ర స్వామి కొలువై ఉన్న ఉప్పల గట్టుకు ఆనుకుని ఉన్న నర్రిగుట్టను అభివృద్ధి చేయాలన్నారు. మండలంలో దాదాపుగా వెయ్యి కుటుంబాల పైచిలుకే చేనేతపై జీవిస్తున్న చేనేత కార్మికులు వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడతారని, నర్రిగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న క్రషర్ మిషన్ అనుమతులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను సంబంధిత అధికారులతో పాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంగ వెంకటేష్, మలిగే శ్రీశైలం, బండారు రాములు, జగన్నాధం పాల్గొన్నారు.