Montha Cyclone | తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైంది. ఆ తర్వాత వరంగల్ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, ఉరుసులో 233.7, సంగెంలో 23.48 సెంటీమీటర్ల వర్షం పడింది. జనగామ జిల్లా గూడురులో 23.58, వర్ధన్నపేట (వరంగల్)లో 22.8, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 79819 75495 నంబర్లో సంప్రదించాలని.. అత్యవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు.
Read Also : TG Weather | ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోనూ భారీ వర్షం కురిసింది. 15.2 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. దాంతో రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరింది. పట్టాలపైకి భారీగా వరద చేరడంతో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రైల్వేట్రాక్‌పై నీరు నిలిచిపోవడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు బస్సుల్లో పంపుతున్నారు. మరో వైపు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదుగంటల పాటు నిలిచిపోయింది. ట్రాక్‌పై నీరు తగ్గకపోవడం వరంగల్‌కు తిప్పిపంపి.. రైలును దారి మళ్లించారు. గుండ్రాతిమడుగు నుంచి వరంగల్‌కు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తిప్పి పంపారు. ప్రయాణికులకు ఆహార పానియాలను పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అందించాయి. మానవతా సహాయం అందించిన పోలీసులను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా.. డోర్నకల్ రైల్వేస్టేషన్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
స్టేషన్లో నుంచి నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్ద చెరువుకు బుంగ పడింది. పెద్ద చెరువుకు బుంగపడడంతో కట్ట కుంగిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. చెరువు కట్ట తెగితే గుండ్రాతిమడుగు రైల్వే ట్రాక్‌పైకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. పాకాల చెరువు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు హన్మకొండ బస్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో బస్టాండ్ చెరువును తలపిస్తున్నది. బస్టాండ్‌లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.