TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుపాను మొంథా మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటిందని.. కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. తీవ్ర తుపాను ప్రస్తుతం బలహీనపడిందని.. రాబోయే రోజు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, ఖమ్మానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ఏపీ, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల రెండురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.