Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ట్రాక్‌పై నుంచి నీరు పారుతుండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. మరో రైలును రీషెడ్యూల్ చేసింది. ఇవాళ నడవాల్సిన సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07233) రైలును రద్దు చేసినట్లు పేర్కొంది.
అలాగే, గురువారం నడవాల్సిన సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (07234) రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా – కన్యాకుమారి (06318) రైలును కాజీపేట, గుంతకల్, రేణిగుంట మీదుగా మళ్లించినట్లు చెప్పింది. రామేశ్వరం-ఫిరోజ్‌పూర్ (20497) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం, రాయగడ,రాయ్‌పూర్ మీదుగా నాగ్‌పూర్‌కు మళ్లించినట్లు పేర్కొంది. ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్, కాజిపేట, పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లించినట్లు చెప్పింది. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందే భారత్ రైలును రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. ఈ రైలు ఐదు గంటలు ఆలస్యం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.