నల్లబెల్లి, డిసెంబర్ 24 : వివాదంలో ఉన్న భూమికి సంబంధించి విచారణ చేపట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద మంగళవారం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన వక్కల వెంకటేశ్‌కు అదే గ్రామానికి చెందిన తౌట్శెట్టి రాజిరెడ్డికి మధ్య భూ వివాదం ఉండగా వారిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఈ నెల 18న వక్కల వెంకటేశ్ గ్రామపంచాయతీ అనుమతితో తన భూమిలో గుగులోత్ రాజు, రవి అనే ఇద్దరు కూలీలతో చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. దీనిపై రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్సై గోవర్ధన్ కూలీలపై చేయి చేసుకోగా సదరు కూలీలు పోలీసులపై నేషనల్ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదుచేశారు.
ఈ మేరకు ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘కూలికి వెళ్లడమే నేరమా’.. అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తహసీల్దార్ ముప్పు కృష్ణతోపాటు ఆర్ఐ కార్తీక్ విచారణ చేపట్టారు.
విచారణలో తౌట్శెట్టి రాజిరెడ్డి తప్పుడు ధ్రువపత్రాలతో పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు గుర్తించారు. సర్వే నంబర్ 10/బీలోని 23 గుంటల భూమి వక్కల వెంకటేశ్‌కు చెందినదిగా పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన రికార్డును కలెక్టర్‌కు ఇవ్వనున్నట్టు తహసీల్దార్ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన వ్యక్తిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.