హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి బాజాప్తాగా 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై నిత్యం ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తమ కాలి గోటికి కూడా సరిపోడని వ్యాఖ్యలు చేశారు. నిరంజన్‌రెడ్డికి సమాధానం చెప్పాలంటే తమ ఎంపీటీసీలు కూడా ఎక్కువేనని అన్నారు.
ఆదివారం సీఎల్పీలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డితో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే నిరంజ్‌రెడ్డి విమర్శలు చేస్తారా ? అని ప్రశ్నించారు. మంత్రిగా నిరంజన్‌రెడ్డి అక్రమాలపై ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు లేఖలు ఇచ్చేందుకు సిద్ధమని హెచ్చరించారు. నిరంజన్‌రెడ్డి అవినీతిని నిరూపించి తీహార్ జైలుకు పంపిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.