వనపర్తి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Meghareddy) నోటిదురుసుతో కొత్త సర్పంచులు నొచ్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచే సర్పంచులు (Sarpanch) తన ఇంటి గేటులోకి వస్తే గెంటేస్తానని హెచ్చరించడం తీవ్రచర్చకు దారితీసింది. వనపర్తి జిల్లా ఏదుల మండలం చెన్నారంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘నా మనషులను కాదని.. ఇతరులను గెలిపిస్తే.. వారు సర్పంచ్, వార్డు సభ్యుడి హోదాలో సీసీ రోడ్డు, లైట్లు, డ్రైనేజీలు, రేషన్‌కార్డులు కావాలని కాగితాలు పట్టుకొని నా వద్దకు వస్తే.. నా ఇంటి గేటులోకి రా కుండా గెంటేస్తా’నంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొలి, మలి విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో నిరాశకు లోనుకావడంతోపాటు తన పార్టీ ముఖ్య అనుచరులంతా ఓడిపోవడంతో ఫ్రస్టేషన్లో ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేకు ఏమైందంటూ జోరుగా చర్చ నడుస్తున్నది. రెండు విడతల్లో 181 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్కు 67 సర్పంచ్ స్థానాలు రాగా.. కాంగ్రెస్ పార్టీకి 97 స్థానాలు, 5 స్థానాల్లో బీజేపీ, 12 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కారు జోరును చూసే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు సరికాదు. కొత్తగా వచ్చే మాలాంటి వారికి అవసరమైతే మంచి సూచనలు చేయా లి. ఎన్నికల వరకే రాజకీయం అంటారు. కానీ, ఇలా మాట్లాడి కొత్త సర్పంచుల మనస్సు గాయపర్చడం మంచిది కాదు. గేటు ముందు నుంచే గెంటేస్తాననడం చాలా తప్పు. వారి విజ్ఞతకే వదిలేస్తాం.