హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రతిపక్ష మహిళా సభ్యులను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనమండలిలో చర్చించాలని బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చర్చకు అనుమతించకపోవడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు. అంతకు ముందు బీఆర్ఎస్ తరఫున మధుసూదనాచారి, సురభివాణిదేవి, మహమూద్‌అలీ, శంభీపూర్‌రాజు మండలిలో నిరసన తెలిపారు.
అసెంబ్లీ అంశంపై చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చర్చకు అనుమతి ఇవ్వలేదు.బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతున్న క్రమంలోనే చైర్మన్ అనుమతితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించారు. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో చర్చలకు అనుమతి ఇవ్వలేదన్న అంశంపైనా నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. వెంటనే మండలి సమావేశాలను ఆగస్టు 1కి వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటించారు.