పాలకుర్తి, ఆగస్టు 3: జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు. అయినా యూరియా అందక ఇబ్బందిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తానన్న మార్పు ఇదేనా అంటూ మండిపడ్డారు.
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచని ఈ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒకటేనని విమర్శించారు. రైతులు తప్పని పరిస్థితిలో యూరియా కోసం ప్రైవేట్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శనివారం సహకార సంఘానికి 444 బస్తాల యూరియూ దిగుమతి కాగా.. 185 మందికి పంపిణీ చేసినట్టు సిబ్బంది తెలిపారు. మిగిలిన రైతులకు యూరియూ అందక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
రైతులకు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని రోజులు గుర్తుకొస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు రైతులు యూరియూ కోసం ఇబ్బంది పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతుల కష్టాలు మొదలయ్యాయి.
-దయ్యాల భిక్షపతి, రైతు, మల్లంపెల్లి