KTR | అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను “గుంపు మేస్త్రి” అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్లో నిర్వహించిన “బస్తీ బాట” కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న తమను బలవంతంగా తరలించి, ఆ భూములను ప్రభుత్వం అమ్మేసుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బస్తీవాసులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పట్టాలను కూడా రద్దు చేసి, తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదని అన్నారు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవని కేటీఆర్ అన్నారు. ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి… మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాదని హామీ ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి… కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దని సూచించారు.
పెద్దలకు ఒక నీతి… పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మేమంతా మీకు అండగా ఉంటాం… ఎవ్వరూ భయపడకండని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని తెలిపారు.