KCR | రామగుండం : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 200 సీట్లు వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీజేపీకి 200 సీట్లు రావు అని వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. 14 నుంచి 15 సీట్లు గెలిస్తే.. సింగరేణిని కాపాడుకుంటాం. నదులును కాపాడుకునే అవకాశం ఉటుంది. బీఆర్ఎస్ ఎంపీ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగానే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెరవేరుస్తది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ నిస్వార్థపరుడు. కార్మిక లోకంలో బతికిన వ్యక్తి.. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
దళితబంధును బంద్ చేశారు. వారు ఏం పాపం చేశారు. మా ప్రభుత్వంలో లక్షా 30 వేల కుటుంబాలకు మంజూరు చేశాం. వారికి మేం డబ్బులు విడుదల చేస్తే వాటిని వాపస్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో దళితులు ప్రతీకారం తీర్చుకోవాలి. బీఆర్ఎస్కు ఓటు వేసి చురుకు అంటించాలి. 2001లో జెండా ఎగురవేసి.. తెలంగాణ రావాలని ప్రాణాలు అడ్డం పెట్టి పోరాటం చేశాను. చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకున్నాం. సింగరేణిని కాపాడుకున్నాం. పేదలను ఆదుకున్నాం. కానీ అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదు. మళ్లా రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే.. ప్రజల అండదండలతో మళ్లీ మనమే వస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులను కాపాడుకోగలుగుతాం. సింగరేణి మనది మనకు ఉంటది అని కేసీఆర్ స్పష్టం చేశారు.