సిద్దిపేట, ఫిబ్రవరి14: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం గుడ్డిలో మెల్ల అని పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సహజంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం సహజమని తెలిపారు. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపలేదని అన్నారు.
కేసీఆర్ హయాంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. 32 జడ్పీ చైర్మన్ స్థానాల్లో విజయం సాధించిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడి, చివరికి కౌంటింగ్‌లోనూ అక్రమాలకు పాల్పడి గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్పొరేషన్‌లోనూ, మెజారిటీ మున్సిపాలిటీల్లోనూ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కుదేలైందని తలసాని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీరు లేక రైతులు పడిన గోసలు చూసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనేక ప్రాజెక్టులు నిర్మించినట్టు తెలిపారు.
గతంలో నీరు, విద్యుత్తు లేక రా ష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తాను టీడీపీ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేగా పని చేశానని, అప్పు డు నాలుగైదు గంటలకు మించి కరెంట్ ఉండేది కాదని అన్నారు. కానీ, కేసీఆర్ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. రైతులు, వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్టు చెప్పారు.
రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని అన్నారు. నాడు భూ ముల ధరలు ఆకాశాన్ని తాకితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన విధానాలు లేక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తంచేశారు. నేడు భూములను కోనేవారు లేరని, దీంతో రియల్ ఎస్టేట్‌తోపాటు నిర్మాణ రంగంలో సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నారు.