సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ జోన్ పరిధిలో జీవో 66 ప్రకారం టెండర్లను పారదర్శకంగా నిర్వహించాలని శంషాబాద్ జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (జీహెచ్ఎంసీ) డిమాండ్ చేసింది. మంగళవారం సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను కలిసి అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ ప్రాంతాల్లో ఇటీవల పిలిచిన టెండర్లలో తీవ్రమైన అక్రమాలు, పక్షపాత ధోరణి, జీవో 66 నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు ఆరోపించారు.
ఈ విషయమై ఇదివరకే పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకపోతే పోరాట కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అడహక్ వైస్‌చైర్మన్ సాయి కిరణ్, శంషాబాద్ జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి రాముగౌడ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.