హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తెలంగాణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం ఒక ఆడియో విడుదల చేశారు. ‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గడచిన పదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే.
వ్యవసాయం నుంచి ఐటీ వరకు, విద్య నుంచి వైద్యం వరకు, పల్లె నుంచి పట్నం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండబట్టే ఈ ప్రగతి సాధ్యమైంది. ఈ అభివృద్ధి ఇలాగే కొసాగాలంటే మీ ఆశీర్వాదం, మీ అందరి సహకారం కావాలి. నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకు ఓటు వేయండి, తెలంగాణను గెలిపించండి.’ అని పేర్కొన్నారు.