హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘ఇక్కడికి వేలాదిగా తరలివచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఐదు నెలల కిందట మీకు, మాకు దూరమైన గోపన్న గుర్తుకు వస్తున్నడు. ఆయనను మీరు ఏవిధంగా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతున్నది.. గోపన్న మరణంతో ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన, ఓటేసి ఆదరించండి’ అంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ అభ్యర్థించారు. ఆదివారం యూసూఫ్‌గూడలో జరిగిన కేటీఆర్ రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. తన భర్త గోపన్నను తలుచుకొని కంటతడిపెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాల కోసం నా కుటుంబంపై కుట్రలు చేస్తున్నరు. నాపై, నా పిల్లలపై కేసులు పెడుతున్నరు. బెదిరింపులకు దిగుతున్నరు’అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆడబిడ్డనైన తనను గెలిపిస్తే మీ కష్టాలను కడతేరుస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్నవారు గోపన్న సెల్‌ఫోన్‌కు అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని భరోసానిచ్చారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అభయమిచ్చారు.