హైదరాబాద్, జూన్ 8( నమస్తే తెలంగాణ): తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (ముదిరాజ్) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వివేక్ వెంకటస్వామి ఇంగ్లిష్‌లో, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ టీమ్‌లో చేరిన ఈ ముగ్గురు మొదటిసారి ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అలాగే, డోర్నకల్ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన జాటోత్ రాంచంద్రునాయక్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నియమించబోతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. కొత్త మంత్రులతో పాటు త్వ రలో బాధ్యతలు చేపట్టబోయే డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పదవులు ఆశించి భంగపడిన నలుగురు ఎమ్మెల్యేలు పీ సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి గైర్హాజర్ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు దకుతుందని ప్రచారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సుదర్శన్‌రెడ్డి పేరు సిఫారసు చేయటంతో ఆయనకు బెర్తు ఖాయమని అనుకున్నారు. సీఎం కార్యాలయ వర్గాలు కూడా శనివారం ఆయనకు ఫోన్ చేసి అందుబాటులో ఉండాలని సూచించినట్టు తెలిసింది.
అర్ధరాత్రి వరకు ఆయన పేరు ఫైనల్ లిస్టులో ఉందనే ప్రచారం జరిగింది. కానీ, ఆదివారం ఆయన పేరు అనూహ్యంగా గల్లంతు కావడంలో మపస్తాపానికి గురైనట్టు తెలిసింది. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇంటి ముంగిట వరకు వచ్చిన మంత్రి పదవి జానారెడ్డి మంత్రాంగంతోనే తనకు కాకుండా పోయిందనే ఆవేదనతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైనట్టు తెలిసింది. అలాగే, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టినట్టు తెలిసింది.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ప్రస్తుతం వారికి కేటాయించే శాఖలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎస్ రామకృష్ణారావు గెజిట్‌తో పాటు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖను కట్టబెడతారనేది ఆసక్తిగా మారింది. పాత మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులు చేర్పులు చేసి కొత్త వారికి ఇస్తారా? లేక ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన తండ్రి దివంగత వెంకటస్వామి సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో శ్రీహరికి మంచి సాన్నిహిత్యం ఉన్నదని చెప్తారు. సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పనిచేశారు.
ఎస్సీ-మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996-2001 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. పాత మేడారం నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఓడిపోయిన లక్ష్మణ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి విజయం సాధించారు.