బాసర, నవంబర్ 16 : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా మంత్రులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజులుగా నిర్మల్ జిల్లా ముథోల్ నియోజక వర్గంలోనే ఉంటున్నారు. శనివారం ఉదయం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ట్రిపుల్ ఐటీ మీదుగా బాసర అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రిపుల్ ఐటీ మీదుగానే భైంసాకు వెళ్లారు. గత సోమవారం పీయూసీ- రెండో సంవత్సరం విద్యార్థిని స్వాతిప్రియ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలు తెలిసి కూడా మంత్రి కనీసం లోపలికి వెళ్లి విద్యార్థులతో కలవలేకపోయారు. నూతనంగా ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన వీసీ గోవర్ధన్ భైంసాలోని ఓ ప్రైవేటు అతిథి గృహం వద్దకు వెళ్లి మంత్రిని కలిసి ట్రిపుల్ ఐటీ సమస్యలను వివరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్క గతంలో బాసరకు వచ్చినా ట్రిపుల్ ఐటీని సందర్శించ లేదు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ట్రిపుల్ ఐటీని ఎవరు సందర్శించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.