జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వస్తే రేవంత్‌రెడ్డికి వణుకు పుడుతున్నది. కేసీఆర్ అంటే సీఎంకు అంత భయమెందుకో’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా బృందం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించింది. మేడిగడ్డకు వెళ్లిన వారిలో ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, శంకర్‌నాయక్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మేడిగడ్డ సందర్శనకు ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో కేసీఆర్ నల్లగొండలో బహిరంగ సభ పెడితే రేవంత్‌రెడ్డి అదే రోజు హడావిడిగా మేడిగడ్డలో సభ పెట్టారని, ఈ నెల 20న బీఆర్ఎస్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెడుతుండగా అదే రోజు రేవంత్ మేడిగడ్డ సభ పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సందర్భంగా సీఎం తన అధికార యంత్రాంగాన్నంతా మేడిగడ్డకు తరలిస్తున్నారని, ఆయన ఎన్ని ట్రిక్కులు చేసినా ఆ సభ దుమ్మురేపుద్దని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని గుర్తుచేశారు. ఎల్అండ్టీ సంస్థ మేడిగడ్డ బరాజ్‌ను రిపేరు చేస్తామని చెప్పినప్పటికీ రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెట్టారని, రెండున్నరేండ్లు రైతులను కష్టపెట్టారని, రైతుల ఉసురు తగులుద్దని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకున్న బీజేపీ నేతలు నేడు కాంగ్రెస్‌తో జత కట్టి విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేవలం రెండు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడితే ప్రాజెక్టునే పక్కకు పెట్టిన కాంగ్రెస్ కుట్రలు రైతులకు తెలిసిపోయాయని అన్నారు. ‘నీ ఇల్లు కట్టేటప్పుడు ఒక పిల్లర్ కుంగింది.. నేను వచ్చి చూసిన.. మరి ఇల్లు కట్టడం మానేశావా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రెండున్నరేండ్లుగా ఇసుక దందా కొనసాగిస్తూ రేవంత్‌రెడ్డి, ఆయన దండుపాళ్యం ముఠా జేబులు నింపుకొంటున్నదని ఆరోపించారు. రేవంత్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు, రైతులు నమ్మే స్థితిలో లేరని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ సత్తాచూపుతుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్
ఎల్అండ్టీ సంస్థ మేడిగడ్డ బరాజ్‌ను రిపేరు చేస్తామని చెప్పినా కావాలని రెండున్నరేండ్లు పక్కన పెట్టి రైతులను గోస పెడుతున్న సీఎం వెంటనే వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలువురు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బరాజ్‌ను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. కేవలం జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో వణుకుపుట్టిన రేవంత్.. హుటాహుటిన మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టుకున్నారని వారు మండిపడ్డారు. హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించుకుని పనులను పర్యవేక్షించవచ్చని, పునరుద్ధరణ పనులను ప్రారంభించడానికి వస్తే బాగుంటుందని, కానీ ఇప్పుడు మళ్లీ ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ సందర్శనకు శనివారం వెళ్లగా ప్రాజెక్టు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రాజెక్టులో ఏం జరుగుతున్నది? ఎందుకు అడ్డుకుంటున్నా రు? ఇంకా ఎన్నేండ్లు బరాజ్‌ను బలిపెడతారని నేతలు మండిపడ్డారు. చివరికి ఐదు కార్లను మా త్రమే అనుమతించడంతో ముఖ్య నేతలు వెళ్లా రు. మిగిలిన నేతలు, కార్యకర్తలు ఎర్రటి ఎండ లో సుమారు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ బరాజ్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు.
మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టునే బందు పెడ్తవా? నీ ఇల్లు కట్టేటప్పుడు ఒక పిల్లర్ కుంగింది.. నేను వచ్చి చూసిన.. మరి ఇల్లు కట్టడం మానేశావా? రేవంత్‌రెడ్డీ?
– ఎర్రబెల్లి దయాకర్‌రావు