ఖమ్మం/కూసుమంచి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని, రైతులు పుట్టెడు కష్టంలో ఉన్నారని కేంద్రమంత్రికి శోకతప్త హృదయంతో విన్నవించాడు.
ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని శుక్రవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ కూసుమంచి మండలం పాలేరు నవోదయ పాఠశాలలో రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు తన గోడును వెల్లబోసుకున్నారు. నర్సింహారావును గుండెకు హత్తుకుని, అధైర్యపడొద్దని కేంద్రం అండగా ఉంటుందని చౌహాన్ భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర మంత్రులు శుక్రవారం పరిశీలించారు. కూసుమంచి మండలంలోని నానుతండా, నర్సింహులగూ డెం, పాలేరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వారి వెంట ఉండి జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించారు. పాలేరు ప్రధాన కాలువకు పడిన గండిని కేంద్ర మంత్రులు పరిశీలించారు. ఖమ్మం, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రులు తిలకించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం వాటిల్లిందని, తగిన సాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బం డి సంజయ్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం రూ.5,438 కోట్లని సీఎం చెప్పారు.
రాష్ర్టాలు వంద శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధనను సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని, ఏపీ మాదిరిగానే తెలంగాణకూ కేంద్రం సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో డిప్యూటీసీఎం భట్టి విక్రమార, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కేంద్రవ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహన్ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కనీస మద్దతు ధర రూ.15వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మరికొన్నింటిపై విన్నవించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తుమ్మల పేర్కొన్నారు.