పెద్దపల్లి : నేరాలకు పాల్పడే వ్యక్తులు భవిష్యత్లో సత్ప్రవర్తనతో ఉండి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కల్పించే పునరావస పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం ఎస్టీ కాలనీకి చెందిన అజ్మీరా లక్ష్మణ్ నాయక్ గుడుంబా తయారీ , విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇకపై తాను సత్ప్రవర్తనతో మెలుగుతానని అధికారులకు విన్నవించడంతో పునరావాసం పథకం కింద అతడికి 2017లో ప్రభుత్వం మేకల పెంపకానికి రూ. రెండు లక్షలు మంజూరు చేసింది.
కొంతకాలం సత్ప్రవర్తనతో ఉన్న ఆయన కరోనా తరువాత తిరిగి గుడుంబా అమ్మకాలను మొదలు పెట్టాడు. లక్ష్మణ్ నాయక్ ద్విచక్రవాహనంపై గుడుంబా రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి రామగుండం తహసీల్దార్ జావేద్ ఎదుట బైండోవర్ చేశారు. అనంతరం కూడా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ గుడుంబా అమ్ముతూ నవంబర్ 4 న మరోసారి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. బైండోవర్ ఉల్లంఘన కింద అతడికి తహసీల్దార్ సంవత్సరం జైలు శిక్షవిధించారు.
మంగళవారం అజ్మీరా లక్ష్మణ్ నాయక్ ను అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు పంపించామని ఎక్సైజ్ సీఐ సుంకరి రమేశ్ తెలిపారు. ఇటీవల సవరించిన నిబంధనల ప్రకారం బైండోవర్ ఉల్లంఘించిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష అమలు అవుతుందని పేర్కొన్నారు.