నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సర్కారు జీతం తీసుకుంటున్న కొందరు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఐఎంఏ సమావేశం ఇప్పుడు రాద్ధ్దాంతానికి దారితీసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మీట్ విత్ డాక్టర్స్ పేరుతో బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేకంగా ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాకు తెలియకుండా బీజేపీ ప్రజాప్రతినిధులు, ఐఎంఏ బాధ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు.
తీరా ఫొటోలు బయటికి రావడంతో కొంతమంది ప్రభుత్వ వైద్యులు ఈ భేటీలో పాల్గొన్న విషయం వెలుగుచూడటంతో వివాదాస్పదంగా మారింది. సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ అర్వింద్‌తో మీట్ విత్ డాక్టర్స్… అంటూ ప్రదర్శించడం గమనార్హం. ఇందులో అనేకమంది ప్రైవేటు డాక్టర్లు ఉన్నప్పటికీ, దాదాపు ఐదుగురు ప్రభుత్వ వైద్యులు ఇందులో పాలుపంచుకోవడంపై చర్చ జరుగుతున్నది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. ఈసీ నిబంధనల మేరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలా పాల్గొంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు.