హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : దేశంలో జమిలి ఎన్నికల అమలు 2034 నుంచి అమలులోకి వచ్చే అవకాశమున్నదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు (జమిలి) నిర్వహించాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిందని తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్నది ఈ బిల్లులో కేంద్రం స్పష్టంగా పేర్కొనలేదని అన్నారు.
ఆర్టికల్ 82ఏ ప్రకారం 2029 లో కొత్తగా లోక్‌సభ ఏర్పాటైన రోజు నుం చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమలులో కి వస్తుందని ఇందులో పేరొన్నట్టు వెల్లడించారు. దీనినిబట్టి జమిలి ఎన్నికల అమలు 2034 నుంచి అమలులోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాల్సి ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలియజేస్తామని వినోద్‌కుమార్ తెలిపారు.