Govt Hospitals | బయ్యారం, ఆగస్టు 29: సర్కారు వైద్యం సరిగా అందడం లేదు.. ప్రభుత్వ దవాఖానల్లో మందులుండవు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్‌పై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. బయ్యారం మండల కేంద్రంలోని శ్రీరామ, ప్రశాంతి క్లినిక్‌లను, ల్యాబ్‌లను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సరైన అనుమతులు లేవని, పరిమితికి మించి వైద్యం చేస్తున్నారని, వాటిని మూసేయాలని నిర్వాహకులను ఆదేశించారు. దీంతో విష జ్వరాలతో వైద్యం చేయించుకునేందుకు అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా వైద్యశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు దవాఖానల్లో మందులుండవని.. రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని, అందువల్లే తాము ప్రైవేటును ఆశ్రయించాల్పి వస్తున్నదని చెప్పారు.
ఈ వైద్యశాలలను మూసి వేస్తే తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. బయ్యారం, గంధంపల్లి వైద్యశాలల్లో ల్యాబ్ టెక్నిషియన్లు లేరని, రక్త నమూనాల రిపోర్ట్ వచ్చేందుకు వారం పడుతున్నదని, దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తున్నదని మండిపడ్డారు. పల్లె దవాఖానల్లో సైతం మందులు, సిబ్బంది లేకనే మండల కేంద్రాల్లోని వైద్యశాలలకు వస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సేవలు మెరుగు పరిచి ప్రైవేటుకు పోకుండా కట్టడి చేయాలని సూచించారు.