జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్, జనవరి10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మహదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన రికార్డుల తనిఖీని ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశించిన 46 అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా డీపీఆర్ అండ్ సీడబ్ల్యూసీ క్లియరెన్స్, సీడబ్ల్యూసీ ఇచ్చిన పంప్‌హౌస్, బరాజ్‌ల డ్రాయింగ్, డిజైన్ వివరాలు, ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వే వివరాలు తేదీల వారీ గా, పంప్‌హౌస్ అండ్ బరాజ్‌ల ఫౌండేషన్ ఎక్స్‌ప్లోరేషన్ వివరాలు, సీఈ, సీడీవో అప్రూవల్ డిజైన్ అండ్ డ్రాయింగ్, ఎస్టిమేట్ అండ్ అప్రూవల్ వివరాలు, అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు గ్యా రెంటీస్, సప్లిమెంటల్ అగ్రిమెంట్, మేడిగడ్డ నేషనల్ డ్యాం సేఫ్టీ రిపోర్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
జ్యోతినగర్/తిమ్మాపూర్: పెద్దపల్లి జిల్లా రా మగుండం ఎన్టీపీసీలోని మూడు ఇరిగేషన్ ఆఫీసులు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల ఎస్సారెస్పీ క్వార్టర్లలోని ఈఎన్సీ క్యాంప్ ఆఫీసులో రెండో రోజూ విజిలెన్స్ సోదాలు కొనసాగాయి. రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఏస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో మూడు బృందాలు సోదాలు చేపట్టాయి. భీమునిపట్నం చిలుకలయ్యగుడి ఏరియాలోని నీటిపారుదల, ఆయకట్టు అభివృ ద్ధి శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో మరో బృందం నిర్వహించిన సోదాలు బుధవారం సాయంత్రం ముగిశాయి.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను సీజ్ చేసి తరలించారు. కాగా కృష్ణానగర్‌లోని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో మూడో బృందం జరుపుతున్న సోదాలు బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. ఇక్కడ విజిలెన్స్ డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, ఏఈ, డీఈ ఉన్నారు. కరీంనగర్ జిల్లా తి మ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న పత్రాలు, డేటాను సేకరించారు.