జయశంకర్ భూపాలపల్లి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు రోజులుగా నిర్వహించిన విచారణ గురువారంతో ముగిసింది. మహదేవపూర్ డివిజన్ కార్యాలయంలో మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ రమేశ్, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ అధికారులు.. విచారణ మధ్యలో ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావుతో కలిసి ప్రత్యేకంగా మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
డీపీఆర్ అండ్ సీడబ్ల్యూసీ క్లియరెన్స్, పంప్‌హౌస్, బరాజ్‌ల డ్రాయింగ్, డిజైన్, ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వే వివరాలు (తేదీల వారీగా), పంప్‌హౌస్ అండ్ బరాజ్‌ల ఫౌండేషన్ ఎక్స్‌ప్లోరేషన్, సీఈ, సీడీవో అప్రూవల్ డిజైన్ అండ్ డ్రాయింగ్, ఎస్టిమేట్ అండ్ అప్రూవల్, అగ్రిమెంట్ కాపీ, మేడిగడ్డ నేషనల్ డ్యాం సేఫ్టీ రిపోర్టు తదితర 46 అంశాలపై తనిఖీలు కొనసాగించారు. పలు రికార్డులను తమ వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నామని, విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ఎస్పీ రమేశ్ చెప్పారు.