చెన్నై, మార్చి 17: తమిళనాడులో శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల్లో సందడి ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రధానంగా అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేతో పాటు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంది. ఇన్నాళ్లు అయితే డీఎంకే, లేదా ఏఐడీఎంకేనో గెలిపిస్తూ సంప్రదాయ ద్రవిడ పార్టీలకు రాష్ట్ర ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. అయితే ఈసారి ఉప్పెనలా దూసుకొచ్చి ప్రచారం సాగిస్తున్న విజయ్ పార్టీ అనూహ్య విజయం సాధించి తమిళగడ్డపై సంచలనానికి తెర తీస్తుందా? డీఎంకేకు గట్టి సవాల్ విసురుతుంతా? అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవలే కొత్త పార్టీ స్థాపించిన మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డీఎంకేకే గెలుపు అవకాశాలు?
ఇప్పటికే చిన్నాచితకా కలిపి మొత్తం 24 పార్టీలతో ఏర్పడిన డీఎంకే కూటమి మరోసారి తమిళనాడులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ పరిశీలకుడు ఆర్ కన్నన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆ కూటమి ఓటు బ్యాంక్, ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ పార్టీ చీల్చే అవకాశాలు ఇవన్నీ డీఎంకేకు కలిసి వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే డీఎంకే.. కాంగ్రెస్ సహా తన కూటమి పార్టీలైన కమ్యూనిస్టులు, విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే)లతో పొత్తుపై ఒక అవగాహన కుదుర్చుకుంది. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. ఈ కూటమితో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు కుదురుతుందని గట్టిగా ప్రచారం జరిగినా దానిని టీవీకే కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పనిసరైంది. ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే అధికార డీఎంకే పలు పథకాలు అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నది.కాగా, రెండు ద్రవిడ పార్టీలు కూడా కుల ఆధార పార్టీలు, దళిత పార్టీల కారణంగా ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది. తమిళనాట కాంగ్రెస్ పూర్తిగా డీఎంకే పైనే ఆధారపడే ఉన్న పరిస్థితి ఉన్నది.
పోటెత్తుతున్న జనం దళపతికి ఓట్లేస్తారా?
మరో పక్క కొత్తగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి సొంతంగా తొలిసారి దిగుతున్న నటుడు విజయ్ సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు. అయితే అవన్నీ ఓట్లుగా మారుతాయో లేదో అన్న విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ రాష్ట్రంలో ఇన్నాళ్లు ఉన్న సంప్రదాయ విధానాలకు కచ్చితంగా అడ్డుకట్ట వేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయన ఏఐఏడీఎంకే కూటమిలో చేరుతారా, లేక ఒంటరిగా పోటీ చేస్తారా అన్న విషయంలో పలు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆయనే కనుక ఒంటరిగా రంగంలోకి దిగితే 234 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతారు. ఇప్పటికే అంతర్గతంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ అధికార పార్టీ లేదా విపక్ష కూటమి ఆశలను తీవ్రంగా దెబ్బకొట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఐఏడీఎంకేకే నష్టం కలగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.