కృష్ణా జలాల సాధనకోసం పదేండ్లుగా తెలంగాణ చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు తెలంగాణలో పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపైనా కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇన్నాళ్లూ రాష్ట్రప్రభుత్వం ఎన్నిమార్లు వినతులందించినా పట్టించుకోని మోదీ సర్కారు ఎన్నికలవేళ ఆగమేఘాలపై ఈ నిర్ణయాలను ప్రకటించారు.
Krishna Tribunal | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘లక్ష్య సిద్ధి ఆలస్యమైతే కావచ్చు.. కానీ మన పోరాటం కచ్చితంగా ఫలిస్తుంది’.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరుచూ చెప్పిన మాట ఇది. తెలంగాణ ఉద్యమంలో ఈ మాట అక్షరాలా నిజమైంది. ఇప్పుడు కృష్ణా జలాల సాధన విషయంలో కూడా అదే నిజమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా చేసిన అలుపెరుగని పోరాటం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచింది.
ఇంతకాలం అర్థంపర్థంలేని కొర్రీలతో జాప్యం చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు, తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో చివరకు దిగిరాక తప్పలేదు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం జలాలను పునఃపంపిణీ చేసేలా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న ట్రిబ్యునల్ 2కు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) ఇస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకొన్నది. దీంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే అవకాశం ఉన్నది. ఈ పరిణామంపై యావత్ తెలంగాణ సమాజం, ఇంజినీర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ కృషిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తొమ్మిదిన్నరేండ్లుగా తెలంగాణ పోరాటం
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా, గోదావరి జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేయాలని మాత్రమే అప్పటికే ఉన్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నాటి కేంద్రం రిఫర్ చేసింది. అలా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, ఉద్యమంలో ప్రతిధ్వనించిన న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరదని తెలంగాణ సమాజం ఆదినుంచీ వాదిస్తున్నది. పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటివాటాలను తేల్చాలని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కేంద్ర సర్కారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి నీటి వాటా తేల్చాలని 2014 జూలై14వ తేదీన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అభ్యర్థనకు అనుకూలంగా కేంద్ర న్యాయశాఖ సిఫారసు చేసినా మోదీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో సీఎం కేసీఆర్ తన పోరాటాన్ని మరింత పెంచారు. కేంద్రానికి లేఖలు రాస్తూ ఒత్తిడి పెంచారు.
కాంగ్రెస్ విద్రోహం..
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కకుండా ఏపీ పునర్విభజన చట్టంలోనే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. చట్టంలో సెక్షన్ 89 ప్రకారం అప్పటికే ఆయా రాష్ర్టాలు వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని నిర్దేశించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ విధానంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణపై వివక్షను చూపుతూ కొత్త ట్రిబ్యునల్ డిమాండ్‌ను ఉద్దేశపూర్వకంగానే పెడచెవిన పెట్టిందనే విమర్శలున్నాయి. అయితే, సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలు చేసే అధికారం తమకు లేదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 చైర్మన్ బ్రిజేష్‌కుమార్ ఇటీవలే తేల్చిచెప్పారు. దీంతో కొత్త ట్రిబ్యునల్ వేయటం అనివార్యమైంది.
కేసీఆర్ పోరాటం, ట్రిబ్యునల్ తీర్పుతో మోదీ సర్కారుకు మరింతకాలం తాత్సారం చేసే దారులు మూసుకుపోయాయి. బీజేపీ సర్కారు కావాలనే జాప్యం చేస్తున్నదని తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లటం, రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 5 (1) కింద కొత్తగా టీవోఆర్‌ను జారీ చేసేందుకు కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ -2కు కేంద్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. న్యాయశాఖ సలహా మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని తెలంగాణ, ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.
ఇది తెలంగాణ విజయం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయంపై తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావ్దేశ్ పాండే, అంతరాష్ట్ర జల విభాగం అధికారులు కోటేశ్వర్రావు, సల్లా విజయ్‌కుమార్, తెలంగాణ ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పట్టుబట్టి సాధించిన విజయమని ప్రశంసించారు. అయితే ఇప్పటికే 9 ఏండ్లు జాప్యమైనందున ఒకటి లేదా రెండేండ్ల నిర్దిష్ట కాల పరిమితిని ట్రిబ్యునల్‌కు నివేదిస్తే తెలంగాణకు న్యాయం దకుతుందని అన్నారు.
ట్రిబ్యునల్‌కు కాలపరిమితి విధించాలి: తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం స్వాగతించారు. అయితే ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో కచ్చితమైన కాల పరిమితి విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలపరిమితి లేకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటు లక్ష్యం నెరవేరదని తెలిపారు. ప్రస్తుతమున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ -2 దాదాపు 10 ఏండ్లుగా విచారణ కొనసాగిస్తున్నా తుది తీర్పు ఇవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది
అంతరాష్ట్ర జలవివాదాల చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ చేసేందుకు కేంద్రం ఆమోదించడం తెలంగాణ సాధించిన అపూర్వ విజయం. ఇది సీఎం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం ద్వారానే సాధ్యమైంది. పట్టువదలకుండా చేసిన కృషి ఫలితంగానే తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కేందుకు మార్గం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-వేణుగోపాలాచారి, ఐడీసీ చైర్మన్, టీఏసీ మాజీ సభ్యుడు
నదీ జలాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుకలు మొరిగినట్టు ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి విమర్శించారు. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని 10 ఏండ్లుగా సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాట ఫలితంగానే కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పునఃపంపిణీకి అంగీకరించిందని తెలిపారు. ఎన్నికల జిమ్మికే తప్ప తెలంగాణ ప్రజలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఇన్ని రోజులు తెలంగాణ హకులను కేంద్రం కాల రాసిందని ధ్వజమెత్తారు. ట్రిబ్యునల్‌కు కాల పరిమితిని విధిస్తూ జలాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సీలేరు ప్రాజెక్టు, ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఘట్టాలు..
15-05-2014: ప్రాజెక్టులవారీగా కృష్ణా జలాల నిర్దిష్ట కేటాయింపుకోసం, ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 నిబంధనతో ట్రిబ్యునల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల.
14-07-2014: అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ చేపట్టాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి.
10-08-2015: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
21-09-2016: మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం.
ఆగస్ట్, 2018: సెక్షన్ 3 ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
26-12-2018: సెక్షన్-3 ఫిర్యాదును తెలంగాణ, ఏపీకే పరిమితం చేసేలా ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.
06-10-2020: 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు పట్టుబట్టిన సీఎం కేసీఆర్. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొంటే అంతరాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం’ అని హామీ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి.
15-07-2021: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అధికార పరిధిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్.
09-06-2021: కేంద్ర మంత్రి విధించిన షరతుల మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకొంటూ ఇంటర్ లోక్యుటరీ అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసిన తెలంగాణ సర్కారు.
06-10-2021: సుప్రీంకోర్టు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ.
07-04-2022: సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయాలని కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి లేఖ రాసిన తెలంగాణ సర్కారు.
29.11.2022, 03.04.2023: కేంద్ర జలశక్తి శాఖకు మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
10.07.2023: సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి తెలంగాణ ఆర్థిక మంత్రి విజ్ఞప్తి.
20.09.2023: కృష్ణా జలాల పునఃపంపిణీ చేసే అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్‌కు లేదన్న తెలంగాణ వాదనతో ఏకీభవిస్తూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు.
22.09.2023: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఉటంకిస్తూ ఇకనైనా సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి రెఫర్ చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తిశాఖకు తెలంగాణ సర్కారు మరో లేఖ.