ఐదు వేలు తీసుకొని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నరని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నడు. కాంగ్రెస్‌లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకొన్నరని మాట్లాడ్డానికి మంత్రికి మనసెలా ఒప్పింది?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పేదలను ఇబ్బందులు పెట్టే ఇసొంటి సీఎంను ఇప్పటిదాక చూడలే. ఎవరెవరో వస్తరు.. ఇంటిపై ఏదో రాస్తరు.. ఖాళీ చేయాలని బెదిరిస్తరు.. పిల్లలు, మహిళలు, గర్భిణులు బిక్కుబిక్కుమంటున్నరు. రాత్రింబవళ్లు భయంలోనే బతుకుతున్నం. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతదని అస్సలు ఉహించలే. అక్రమంగా ఇల్లు కట్టుకోలేదు. పర్మిషన్లతోటి కట్టుకున్నం. డాక్యుమెంట్లన్నీ ఉన్నయ్.
-సునీత, భరత్‌నగర్ కాలనీ, అత్తాపూర్
KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా ఇవ్వాలనుకోవడం కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గమైన చర్యలకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. రెక్కల కష్టంచేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి కేటీఆర్ సోమవారం పర్యటించారు.
మూసీ వెంట మార్కింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి బాధితుల గోడు విన్నారు. పేదల ఇండ్లను మూసీలో కలిపే సుందరీకరణ ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం సీటును కాపాడుకునేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్ల నజరానా ఇచ్చేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. పేదల గూడులను కూల్చేసే మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. బఫర్‌జోన్ పేరిట మూసీ వెంట మార్కింగ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న ఆయన సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు.
ఓవైపు బుల్డోజర్ రాజ్యానికి తావు లేదని రాహుల్ గాంధీ చెప్తుంటే.. మరోవైపు రేవంత్‌రెడ్డి తెలంగాణలో బుల్డోజర్లు దింపుతున్నాడని మండిపడ్డారు. రాహుల్ ఏమో చౌకీదార్ చోర్ అంటుంటే.. మోదీ తన పెద్దన్న అంటూ రేవంత్ ఆలింగనం చేసుకుంటాడని, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి తెలంగాణ సాక్ష్యంగా మారిందని చెప్పారు.
పేదల ఇండ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు ఎక్కడికి పోయారని, ఏ ఒక్కరూ నోరెందుకు తెరవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. పేదల ఇండ్లకు తామే అడ్డుగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల భూములను లాక్కొంటున్న రేవంత్‌రెడ్డి, మన్మోహన్సింగ్ తెచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మూసీ పేరిట జరుగుతున్న బాగోతాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, బాధితుల పక్షాన పోరాడుతుందని స్పష్టంచేశారు.
సచ్చుడో, బతుకుడో తెలుస్తలేదు.. కంటనీరు ఆగుతలేదు
సోమవారం అత్తాపూర్‌లో పర్యటించిన కేటీఆర్ ముందు గోడు వెళ్లబోసుకున్న మూసీ బాధితురాలు రేణుక
మా ప్రాణం పోయినా మకాన్ ఖాళీ చెయ్యం
నోటీసులకు వ్యతిరేకంగా కిషన్‌బాగ్‌లో నినదిస్తున్న వృద్ధురాలు, చిన్నారి
హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి తమగోడు వెళ్లబోసుకుంటున్న మూసీ బాధితురాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తమ సమస్యలను చెప్పుకుంటున్న హైదర్‌గూడ మూసీ బాధితులు
హైదర్‌గూడలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఎంపీ రవిచంద్ర, మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు
హైదర్‌గూడలో మాట్లాడుతున్న మూసీ బాధితురాలు రేణుక. చిత్రంలో కేటీఆర్, ముధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు
హైదర్‌గూడలో కేటీఆర్‌తో మాట్లాడుతున్న మూసీ బాధితులు. చిత్రంలో మాజీ మంత్రి మహమూద్ అలీ
పైసాపైసా కూడబెట్టుకొని పేదలు భూములు కొని ఇండ్లు కట్టుకున్నరు. ఈ స్థలం ఎఫ్టీఎల్లో ఉన్నదా? బఫర్ జోన్లో ఉన్నదా? అనేది నాడు అధికారులకు తెల్వదా? ఎట్ల పర్మిషన్లు ఇచ్చిండ్రు? కరెంటు, మంచినీటి బిల్లులు ఎట్ల ఇచ్చిండ్రు? ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా కూల్చడం మంచి పద్ధతి కాదు. వెంటనే ప్రభుత్వం మూసీ సుందరీకరణ, కూల్చివేతల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి.
-వనం నర్సింహ, నందనవనం, హైదర్‌గూడ
ప్రజలను కష్టాలపాల్జేయడమే ప్రజాపాలనా? ప్రజలు బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి తెచ్చిండ్రు.చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రుల బాధలు, కన్నీళ్లు చూడలేకపోతున్నం. ఆడోళ్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రావద్దు.
-అప్పారెడ్డి ముఖేశ్, అత్తాపూర్
మేమంతా తిండెక్కువై రోడ్లమీదికి వస్తలేం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నం. కాం గ్రెస్ పెద్దలు ఒక్కరు కూడా బయటకొచ్చి మా మంచిచెడ్డలు చూస్తలేరు. ఇండ్లళ్ల కూర్చొ ని చోద్యం చూస్తున్నరు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తమంటున్నరు. వాటిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు ఉండాలి. అప్పుడు మేం కూడా వచ్చి ఉంటం. మా కాయకష్టంతో కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్లేందుకు ఏమాత్రం ఒప్పుకోం.
– త్రినాథ్, అత్తాపూర్
మా పరిస్థితి సచ్చుడో.. బతుకుడో తెలుస్తలేదు. మంచి చేస్తమని నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచుతున్నరు. పేదలను ఇబ్బంది పెట్టుడు తప్ప మంచి చేయాలని రేవంత్‌రెడ్డికి లేనట్టున్నది. తినే తిండి కూడా కడుపులకు పోతలేదు. మా పరిస్థితి తలుచుకుంటే కండ్ల నీళ్లు ఆగుతలెవ్వు.
-రేణుక, అత్తాపూర్
ఇక్కడ బత్కాలంటే భయమైతాంది. రోజుకొకడు వచ్చి వేధిస్తున్నరు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నరు. మా ఆయన చిన్న ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే వచ్చిన డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకున్నం. అప్పుడు కాంగ్రెస్సే ఉన్నది. మరి అప్పుడెట్ల పర్మిషన్ ఇచ్చిండ్రు? మేం కష్టపడి కట్టుకున్న ఇంటిని ఉన్నపళంగా కూల్చేస్తామంటే ఏడికి పోవాలె? మా పాణం పోయినా ఈన్నే ఉంటం.
-చంద్రకళ, వృద్ధురాలు, అత్తాపూర్