హైదరాబాద్ : నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
ఈబీఎస్బీ కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 2021 డిసెంబర్ 12 నుంచి 14 వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌లో వీక్షించేందుకు తెరిచి ఉంటుంది.
కళలు, సంస్కృతి ఇతివృత్తాలపై తీసుకువచ్చిన గుర్తించదగిన పుస్తకాలను ప్రచురణల విభాగం ఈ ఎగ్జిబిషన్ లో ఉంచింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఈ జంట రాష్ట్రాల సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం కల్పించడంలో, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయన్నారు.
రెండు రాష్ట్రాల ప్రజలను కలిపి మన సంపన్న, విభిన్న సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించగల ఈ చొరవ తీసుకున్నందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్వోబీ, పిఐబి, డిపిడి, ఎఐఆర్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి , దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధాల ముడిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న చొరవ, స్వాతంత్ర్యానంతరం దేశ ఏకీకరణలో గణనీయమైన పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్బీ) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు
హిమాచల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.9 కోట్ల ఆస్తి నష్టం