హైదరాబాద్: తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మొంథా ప్రభావంతో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని, సిద్దిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధవారం నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.