హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత 23న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంచేసింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు.
గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచి సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నల్లగొండ, మెదక్, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసినట్టు తెలిపారు. హైదరాబాద్లో గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో అత్యధికంగా 6.91సెంటీ మీటర్ల వర్షం పడిందని వెల్లడించారు.