ఆదిబట్ల, ఫిబ్రవరి 8: ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని మరువకముందే మరో రియల్ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ కీలుకత్తి నర్సింహాగౌడ్ అప్పులపాలై శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. హైదరాబాద్‌లో పదిరోజుల వ్యవధిలో ఇది రెండోఘటన. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, క్రయవిక్రయాలు లేక అప్పులపాలై బిల్డర్లు ప్రాణం తీసుకుంటున్నారని పరిశీలకులు చెప్తున్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లికి చెందిన కీలుకత్తి నర్సింహగౌడ్ (45) రియల్ ఎస్టేట్ వ్యాపారి. తనకు ట్రాక్టర్లు కూడా ఉండటంతో గ్రానైట్, ఇటుక, ఇసుక వ్యాపారం కూడా చేసేవారు. ఏడాదిగా రియల్ఎస్టేట్ వ్యాపారం పతనమవడంతో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. దీనికితోడు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి.
దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వాటి కారణంగా మరో 15లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో కలహాలూ మొదలయ్యాయి. దీంతో కొంతకాలంగా తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన నర్సింహగౌడ్ శనివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నర్సింహగౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.