వేములవాడ రూరల్, డిసెంబర్ 11 : సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణాలో జరిగింది. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ఠాణా సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చెర్ల మురళి(50) నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, గత శుక్రవారం ప్రచారం చేసి అలసిపోయి గుండెపోటుతో మృతిచెందాడు. మురళిపై గ్రామస్తులకు సానుభూతి పెరగడంతో ఆయన మద్దతుదారులు ఎలాగైనా గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. వార్డు సభ్యులంతా కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. గురువారం ఎన్నికల్లో 1,717 ఓట్లు పోలవగా.. మురళికి 739, బీజేపీ బలపరిచిన అభ్యర్థి సురువు వెంకటికి 369, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొలాపురి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. దీంతో మురళి తన సమీప అభ్యర్థి వెంకటిపై 370 మెజారిటీతో గెలుపొందాడు. ఎన్నికల అధికారులు మాత్రం మురళి గెలుపును అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్టు అధికారులు వెల్లడించారు.