హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో కోతలు విధించడం తగదని, అదే జరిగితే విద్యార్థిలోకం నుంచి ప్రతిఘటన తప్పదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు విధించాలనే యోచనను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. గత రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, 3 లక్షల కోట్లు పన్నుల ద్వారా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఇతర అన్నిరంగాలకూ నిధులను కేటాయిస్తూ ఫీజు బకాయిల విడుదలలో మాత్రం సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేకుండాపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను వేలం వేయవద్దని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మోక్షం కలుగనున్నది. 10 కాలేజీలకు రూ.117కోట్లు ఇవ్వాలని సర్కారు ముందు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా పక్కాభవనాలు నిర్మించాలని సర్కారుకు నివేదికను సమర్పించింది. రూ.8 కోట్లతో నూతన భవనం, రూ. 2కోట్లతో స్మార్ట్క్లాస్రూమ్, ఇంటరాక్టివ్ ప్లాట్ప్యానల్, కంప్యూటర్లు, ఫర్నిచర్ సమకూర్చాలని సర్కారుకు నివేదించింది. రూ.117 కోట్లలో కేంద్రం వాటాగా రూ.70.38 కోట్లు(60శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.46.92కోట్లను(40శాతం)ప్రతిపాదించింది. ప్రభుత్వ కళాశాలల ధీనస్థితిపై ‘సర్కారు కాలేజీల్లో దినదినగండం.. శిథిలావస్థలో 33కాలేజీలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో సర్కారులో కదలిక వచ్చింది. అయితే విద్యాశాఖ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా..? లేదా..? అన్నది త్వరలోనే తేలనున్నది.