బాల్కొండ/వేల్పూర్, ఆగస్టు 22: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద మోసమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, వేల్పూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వేముల.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు.
మాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.. రైతులు పేపర్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్నా? అని నిలదీశారు. బాల్కొండ నియోజకవర్గంలో 51 వేల మంది పంట రుణాలు తీసుకుంటే, మూడు విడతల్లో కలిపి 15,900 మందికి మాత్రమే మాఫీ చేశారని, మిగతా 36 వేల మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
గజ్వేల్, ఆగస్టు 22: ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పాడని బీఆర్ఎస్ నేత, ఎఫ్డీసీ ఆజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన మాటకు విలువ లేకుండా కొర్రీలు పెట్టి సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోగా అబద్ధ్దాలతో కాలం గడుపుతున్నాడని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు రూ.41 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి తీరా రూ.17వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.