హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో అందమైన అబద్దాలు మాట్లాడించారు. రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన పేపర్ చదవటం కాదు ఖర్గేజీ క్షేత్ర స్థాయిలో తిరగండి.. మీ కాంగ్రెస్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో నిజాలు తెలుస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ఏం చెబుతుందో అది చేసి చూపెడుతుంది అని ఖర్గే అంటున్నారు.
నిజమే ఢిల్లీ కాంగ్రెస్ డబ్బు మూటలు పంపమని చెబుతుంది..రాష్ట్ర కాంగ్రెస్ అది చేసి చూపెడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సక్రమంగా అమలు చేయడం రాదని విమర్శించారు. కేసీఆర్ పెట్టిన క్యాంటీన్ లకు పేర్లు మార్చడం, కేసీఆర్ ఇచ్చిని నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించి మేమే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాము అనడం, గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ కట్టించిన ఫ్లై ఓవర్ లను ప్రారంభించి మీ గొప్పగా చెప్పుకోవడం
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడినట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని ఘాటుగా విమర్శించారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగోట్టినట్టు కాదు, ఒక్కసారి అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి అని హితవు పలికారు. పాడింది పాడురా పాసువండ్ల దాసుగా అన్నట్టు గవే పాత ముచ్చట్లు, గదే అడ్డగోలుగా ఓర్రుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏడాదిన్నర పాలనలో చేసింది ఏమీలేదన్నారు.
వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవటం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలన చేతకాదని మండిపడ్డారు. మగధీరా సినిమాలో డైలాగ్‌లా 100 కి ఒక్కటి తగ్గకుండా ఎమ్మెల్యేలను గెలిపిస్తా.. నేనే సీఎంగా ఉంటా అని ఊహ లోకంలో రేవంత్ రెడ్డి విహరిస్తున్నారు. మీ పాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి మోక్షం ఏప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీరెన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని లాగిపెట్టి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.