మోర్తాడ్, జూలై 29: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ఇటీవల జరిగిన ఘటనలో అక్రమ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించారు. భీమ్‌గల్, పల్లికొండ గ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు తామున్నామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దేవేందర్‌రెడ్డి వేల్పూర్‌లో తన ఇంటికి వచ్చి దాడికి దిగాడని ఆరోపించారు. దాడి చేయడానికి వచ్చిన వారిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేయకుండా, ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో గాయపడిన తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు.