బాల్కొండ(మోర్తాడ్), మార్చి 8: బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ముస్లింలతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వేముల పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ముస్లింలలో పేదరికాన్ని తొలగించడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటేరియట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో రూ. 30 లక్షల నిధులు మంజూరు చేయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం నిధులు వచ్చే వరకు విశ్రమించబోనని పేర్కొన్నారు.