నందిపేట్, మే 27: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, కడ్తా పేరిట రూ.2 వేల కోట్లకు పైగా రైతుల డబ్బు ను ప్రభుత్వంలోని అక్రమార్కులు దోచుకుతింటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశానికి వేముల తోపాటు ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, హన్మంత్ షిండే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ తదితరు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. రైస్‌మిల్లర్లు క్వింటాలుకు 12 కిలోల తరుగు తీసుకుంటూ రైతులను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి రాగానే వాటిని పూర్తిగా గాలికొదిలేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ స్పందిస్తూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర అని, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో భూదందాలు, అక్రమాలు తారస్థాయికి చేరాయని, వాటిని గుర్తిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్’ బయట పెడుతున్నాయని చెప్పారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం ఎంతో ముఖ్యమని, కార్యకర్తలు చురుగ్గా పని చేసి గతం కంటే రెట్టింపు సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని వీజీ గౌడ్ సూచించారు.